♦ కాంగ్రెస్ ప్రభుత్వ సారధిగా వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను నిర్వీర్యం చేస్తున్న సర్కార్
🔵 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, జులై 8 :
ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వానికి నాయకత్వం వహించి.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని భట్టి విక్రమార్క కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జన్మదినం సందర్భంగా భట్టి విక్రమార్క గాంధీభవన్, ఇందిరా భవన్లో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. వైఎస్సార్ తీసుకువచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని భట్టి మండిపడ్డారు. పేద ప్రజల కోసం నాడు కాంగ్రెస్ ప్రభుత్వ సారథిగా వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఇందదిరమ్మ ఇండ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టిన ఫీజ్ రీ ఎంబర్స్మెంట్, రైతాంగం కోసం ఉచిత విద్యుత్ పథకాలను నేటికి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని భట్టి చెప్పారు. నాటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రత్యేక రాష్ట్రంలో పాలకులు తుంగలో తొక్కారని భట్టి మండిపడ్డారు. ఫీజ్ రీ ఎంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ప్రతి ఏడాది రోడ్డు మీదకు వస్తున్నారని భట్టి చెప్పారు. అలాగే కొత్త రాష్ట్రంలో 2014 నుంచి ఒక్క కొత్త ఆరోగ్య శ్రీ కార్డును కూడా ఈ ప్రభుత్వం మంజూరు చేయలేదని భట్టి చెప్పారు. అసలు ఆరోగ్య శ్రీ కార్డులు ముద్రణనే ప్రభుత్వం చేపట్టలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న పేదలకు ఇప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని భట్టి నిప్పులు చెరిగారు.
కృష్ణా, గోదావరి నదులపై జలయజ్ఞంలో భాగంగా మొదలు పెట్టిన అనేక ప్రాజెక్టులను ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చంపేసిందని భట్టి మండిప్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్, ఇందిరాసాగార్, రాజీవ్ సాగర్ దుమ్మగూడెం, కాంతానపల్లి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించి.. రాష్ట్ర ప్రజానీకానికి గోదావరి జలాలు అందకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడిందని భట్టి నిప్పులు చెరిగారు. కేవలం 38 వేల కోట్లతో రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌పై అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు భట్టి చెప్పారు. కేవలం 28 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తయి.. 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా.. రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్ట్‌ను చంపేశారని భట్టి చెప్పారు. రీ డిజైనింగ్ పేరుతో ఎకాఎకిన 84 వేల కోట్లరూపాయలకు పెంచడం.. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తవడానికి లక్ష కోట్లకు పూగా అవసరమని లెక్కలు చెబుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తెలంగాణలో ఎక్కడా వినిపించకూడదన్న కుట్రలతోనే ప్రాజెక్ట్‌ను చంపేశారని భట్టి మండిపడ్డారు. ఈ క్రమంలో ఇందిరాగాంధీ పేరు మీద పెట్టిన ఇందిరాసాగార్ ప్రాజెక్ట్‌ను కూడా చంపేశారని అన్నారు. ఇక ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ దుమ్ము గూడెం ప్రాజెక్టులు కేవలం 1500 కోట్ల రూపాయలతో పూర్తయి నాలుగు లక్షల ఎకరాలకు సాగు తాగు నీరు అందించే అవకాశం ఉండేది. రీ డిజైనింగ్ పేరుతో వారి పేర్లను తొలగించడంతో పాటు. అంచనాలను 12వేల కోట్లకు పెంచి ఖజానాసై అదనపు భారాన్ని ఈ పాలకులు వేశారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.